"యండమూరి వీరేంద్రనాథ్" తెలుగు అక్షరం తెలిసినవారికి పరిచయం అవసరం లేని పేరు ఇది. తెలుగు పుస్తక చరిత్రలో దాదాపు 70 పుస్తకాలు రాసి తెలుగు సాహిత్యానికి అదనపు ఆస్థిగా అందించారు. ఆయన రాసిన పుస్తకాలలో 15 పుస్తకాలు వెండితెరపై సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇంకా ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేసి సూపర్ హిట్ సినిమాలలో భాగం అయ్యారు. ఎవరో చెప్పినట్టు "తన కన్నా గొప్ప రచయితలు మన తెలుగులో ఉన్నారు, తన కన్నా తక్కువ స్థాయి రచయితలు కూడా ఉన్నారు కాని యండమూరి లాంటి రచయిత మాత్రం ఇంకొకరు లేరు". నిజంగా ఇది అక్షరం సాక్షిగా సత్యం.
విద్యాలయ స్థాపనకు స్పూర్తి: కర్నాటక మంగళూరులో పద్మవిభూషన్ వీరేంద్ర హెగ్దే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనాధాశ్రమంలో ప్రతి ఒక్క విద్యార్ధికి కాస్త పొలం ఇస్తారు. ఆ పిల్లవానికి అవసరమయ్యే కూరగాయలు తానే పండించుకోవాలి, దానితో పాటు ఒక గేదెను కూడా ఇస్తారు. ఆ గేదె బాగోగులు చూసుకుని దాని పాలు అమ్ముకుని చదువును కొనసాగించాలి ఇవి అక్కడి నిబందనలు.. చదువు పూర్తయ్యాక ఆ పొలం, గేదెను మరొక విద్యార్ధికి అందజేస్తారు. ఇవి ఆ విద్యాలయ నిబందనలు. ఇలాంటి పద్దతుల మూలంగా పిల్లలకు చిన్నతనం నుండే కష్టపడటం తెలుస్తుంది, సరిగ్గా ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని వారి నమ్మకం. అక్కడి నుండి చదువుకుని ఎంతో మంది ధనవంతులుగా, మంచి పౌరులుగా స్థిరపడ్డారు. ఈ విద్యాలయాన్ని చూసిన యండమూరి గారు అలాంటి విద్యాలయ స్థాపనే సంకల్పంగా మార్చుకుని ఈ సరస్వతి విద్యాపీఠాన్ని స్థాపించారు.
విద్యాలయ పద్దతులు: మన తెలుగులో Personality Development Books తో యండమూరి సాగించిన ప్రయాణం ఎంతో అత్యున్నతమైనది. ఎంతో మంది ఆ పుస్తకాలతో తమ తప్పులు తెలుసుకుని తమ జీవితాలను మార్చుకున్నారు. 2006లో తానే కదలి పిల్లలను సరైన విధంగా తీర్చిదిద్దడానికి సరస్వతి విద్యాపీఠాన్ని స్థాపించారు. రోజుకు కేవలం మూడు గంటలు మాత్రమే అక్కడ చదువు మిగిలిన సమయం అంతా ఆటలు, పాటలు.. ఏంటి ఆశ్చర్యంగా ఉందా..! నిజంగా ఇది సరస్వతి విద్యాపీఠంలో పిల్లల దినచర్య. యండమూరి గారి అభిప్రాయంలో రోజుకు 3 గంటలపాటు విద్యార్ధులు చదివితే సరిపోతుందంటారు.. అనడం మాత్రమే కాదు తన కొడుకు ప్రణీత్ పై ఇలాంటి పద్దతినే అనుసరించారు. ప్రణీత్ ఇంటర్ లో స్టేట్ ర్యాంకర్, సి.ఏ పూర్తిచేసి 23 సంవత్సరాలకే ప్రపంచ బ్యాంక్ లో ఉద్యోగం సాధించారు. తన కొడుకు ప్రణీత్ లాంటి పిల్లలను మరింత మందిని తయారుచేసే యజ్ఞంలో కృత నిశ్చయంగా విద్యార్ధులకు సేవచేస్తున్నారు.
ప్రతిరోజు ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు వివిధ అంశాలలో ఉపాధ్యాయులు టీచింగ్ ఇస్తారు. ఇక మధ్యాహ్నం ఒకటి నుండి సాయంత్రం 4:30 వరకు ఆటలు. ఆటలు అంటే అది కూడా పిల్లల ఉన్నత వ్యక్తిత్వానికి ఉపయోగపడే ఆటలు. పిల్లలలో ఓపిక, జ్ఞానం, పోరట పటిమ, ఆత్మవిశ్వాసం లాంటి దృడమైన వ్యక్తిత్వానికి అవసరమయ్యే అన్ని అంశాలను ఆటల రూపంలో ఒత్తిడి లేకుండా అందించడం. స్వతహాగ ఛార్టెడ్ అకౌంటెడ్, గొప్ప రచయిత ఐన యండమూరి గారు నెలలో 15 రోజులపాటు స్వయంగా పిల్లకు మంచి తెలివితేటలు పెరిగేలా కృషి చేస్తున్నారు.