Meet The Man Who's Teaching Yoga Classes For Free Since A Decade

Updated on
Meet The Man Who's Teaching Yoga Classes For Free Since A Decade

యోగ, ధ్యానం మన భారత దేశ ఆస్తులు.. వీటిని ప్రతి భారతీయుడు నేర్చుకునే హక్కు ఉంది. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా విద్య, వైద్యం ఎలా వ్యాపారమయం అయ్యాయో యోగ, ధ్యానం నేర్చుకోవాలంటే లక్షల్లో ఛార్జ్ చేసే సంస్థలు వెలిశాయి. సరే!! ఫీజు అంటే అందరికి అందుబాటులో వసతులకు తగ్గట్టుగా ఉంటే సబబుగా ఉంటుంది, మొన్నొకరోజు నా స్నేహితుడు యోగ నేర్చుకోవడానికి వెళ్తే "గురువు గారి దగ్గర కూర్చుంటే ఒక ఫీజు, అదే గురువు గారికి దూరంగా కూర్చుంటే మరొక ఫీజు" అని లెక్కలు చెప్పారట. ఇలాంటి అర్ధం పర్థం లేని గురువులు రోజు రోజుకూ పుట్టుకువస్తున్నారు. మనసు, శరీరం బాగోలేకపోవడం వల్లనే యోగ చేద్దామని అనుకుంటే వాళ్ళు చెప్పే ఫీజులకే భయపడి పోయి అంతంత ఫీజులు చెల్లించలేమని సామాన్యులు ఈ యోగ వద్దు రా బాబు.!! అని అప్పటికప్పుడే అందులోనే శాంతిని పొందుతున్నారు.. ఇలా మనం అనుకుంటున్నట్టుగానే విశాఖపట్నం చెందిన పైడం నాయుడు గారు కూడా అనుకున్నారు. బ్రతకడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి ఇలాంటి వాటి ద్వారా డబ్బు సంపాదించుకోకూడదు, సమాజంలో పెరిగిపోతున్న నెగిటివిటిలో ఎంతోకొంత పాజిటివిటిని అందించాలన్న ఆశతో 9 సంవత్సరాల నుండి ఉచితంగా యోగ నేర్పిస్తున్నారు.

ప్రస్తుతానికి 50వేలమందికి ఉచిత యోగ: పైడం నాయుడు గారు కొన్ని ఎకరాల పొలం ఉన్న మాములు రైతు. 2011 లో సంవత్సరం పాటు బెంగళూరు వివేకానంద యోగ కేంద్రంలో యోగ నేర్చుకున్నారు. ఆ తర్వాత తన జీవితంలో తాను నడుస్తూ ఉండగా విశాఖపట్నంలోని ఒక యోగ కేంద్రం వారు యోగ కోసం వేలకు వేలు ఫీజు వసూలు చేస్తున్నారని తెలిసింది. అరే! ఏంటి ఇలా చేస్తున్నారు.. ఇంతింత డబ్బులు గుంజుకుంటే వాళ్లకు యోగ ఎలా శాంతిని పంచగలదు, శరీరాన్ని ఎలా బాగుచేయగలదు అని 2011 లో యోగ భారతి ట్రస్ట్ ద్వారా యోగ నేర్పిస్తున్నారు, ఇందుకోసం ఒక్కరూపాయి కూడా తీసుకోరు.

సంవత్సరాల పాటు ఉచితంగా: ఈ సో కాల్డ్ Institutes చెబుతున్నట్టుగా యోగ 3 నెలలో నేర్చుకోవడం పూర్తవుతుందని చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కో సమయం పడుతుంది, కొన్ని నెలలు, రోజులు అంటే అప్పటివరకు డబ్బులు వసూలు చేసుకోవచ్చని వారి ఉద్దేశ్యం. పూర్ణ చక్రాసనం, పశ్చిమోత్తానాసనం, మయూరాసనం, ఏకపాద శీర్షశాసనము మొదలైన ఆసనాలు సరిగ్గా నేర్చుకోవడానికి ఒక్కోసారి సంవత్సరం, రెండు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. ఇంతకాలం కూడా నాయుడు గారు ఇంకా వారి టీం ఓపికతో ఉచితంగా నేర్పిస్తారు. ఇది కాక మాములు క్రీడా పోటీలు నిర్వహించినట్టుగా యోగ లోనూ ఛాంపియన్ షిప్స్ పెడుతూ గెలిచిన వారికి క్యాష్ ప్రైజ్ అందించడం కూడా చేస్తుంటారు.

ప్రతి జిల్లాలోనూ ఉచిత యోగ: విశాఖపట్నంలోని మద్దెలపాలెం దగ్గరలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంతో పాటుగా సిటీలోని 35 ప్రాంతాలలో ప్రతిరోజూ ఉచిత తరగతులు నిర్వహిస్తున్నారు. మొదట పైడం నాయుడు గారితో మొదలైన ఈ యోగ సేవ ప్రస్తుతం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి విస్తరిస్తుంది. యోగ భారతి ట్రస్టు ద్వారా 50 వేలమంది శిక్షణ పొంది ఉన్నారు, ఇందులో కొంతమంది ఉచితంగా నేర్చుకున్న ఈ విద్యను ఉచితంగానే మిగిలిన వారికి నేర్పిస్తున్నారు. వీరిలో బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు, లాయర్, ఇతర ఉద్యోగస్థులు, విద్యార్థులు ఉన్నారు. ఆరు నెలల క్రితం రాజమండ్రి లోనూ(ఐదు కేంద్రాలు) ఉచితంగా నేర్పించడం మొదలుపెట్టారు.. మూడు నెలల క్రితం కాకినాడలో(ఒక కేంద్రం) మొదలయ్యింది. త్వరలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోనూ ఉచిత యోగ తరగతులు నిర్వహించబోతున్నారు.