Written By: Spiritual Guru Osho
సామాన్యులకే సంతానం కలగకుంటే ఎంతో విచారిస్తారు బాధ పడతారు.. అదే ఓ రాజ్యాధిపతి అయిన రాజుకు సంతానం కలగకుంటే..? తన రాజ్యవంశం ఏమైపోవాలి..? తమని నమ్ముకున్న ప్రజలు ఏమైపోవాలి..? ఇలాంటి పరిస్థితే ఒక మహారాజుకి వచ్చింది. వివాహం జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గాని వారి అభిలాష నెరవేరలేదు. ఎన్నో పూజలు, హోమాలు, యజ్ఞాలు, పుణ్యతీర్ధాల దర్శనాలు, వారి శక్తికిమించిన దానాలు ఎన్ని చేసినా గాని సంతానం కలగలేదు. "ఇక ఈ జన్మలో వారి ప్రేమకు ప్రతిరూపాన్ని చూడలేమనే ఒక నిర్ణయానికి వచ్చేశారు". ఈ ఆశను ఓదిలేసుకున్న కొన్నాళ్ళకు రాజు భార్యకు గర్భం సంభవించింది. వారికి తేజస్సుతో నిండిన మగబిడ్డ జన్మించాడు. మహారాజు ఆనందానికి అడ్డులేదు.. తన కుమారుని పుట్టుకను రాజ్యంలో పండుగలా జరిపించాడు. మిత్రరాజులు సైతం ఈర్ష్య పడేలా ఆ మహారాజు తన కుమారుడిని దైవంలా పెంచసాగాడు. కాని ఆ పరమానందం వారికి ఎంతో కాలం నిలవలేదు. రాకుమారుడుకి 10 సంవత్సరాల వయసు రాగానే ఏదో భయంకరమైన అంతుచిక్కని జబ్బు ఆ బాబుకి సోకింది. ఎన్నో రాజ్యాల నుండి వచ్చిన వైద్యులు పరిశీలించినా గాని పరిస్థితిలో ఏ మార్పులేదు. ఆ బాబు మృత్యువులోకి వేగంగా పయనిస్తున్నాడని అందరికి అర్ధమైయ్యింది. ఎన్నో ఏళ్ళ ఎదురుచూపుల సంతానం కళ్ళముందే ఇలా నిర్జీవంగా పడిపోయి ఉండటం చూస్తున్న ఆ తల్లిదండ్రుల వ్యధ వర్ణనాతీతంగా ఉంది.
రోజులు గడుస్తున్న కొద్ది పరిస్థితి మరింత విషమించింది. కుమారుడి మంచం దగ్గరే ఉంటూ వారిద్దరూ పర్యవేక్షిస్తుండేవారు. ఒకరోజు మహారాజు పడకమీదున్న కుమారుడిని చూస్తూ సుఖ నిద్రలోకి వెళ్ళాడు.. ఆ మహారాజుకి నిద్రలో ఓ బ్రహ్మండమైన కల వచ్చింది. "బయటి లోకంలో ఉన్నట్టుగానే కలలో కూడా ఆ రాజు మహారాజే.. ఇక్కడ ఒక్క రాజ్యానికే రాజు, కాని కలలో మాత్రం సమస్త రాజ్యాలకూ మకుటం లేని మహారాజు. వివిధ రాజ్యాల చక్రవర్తులే తనకు సేవకులుగా ఉండేవారు. లక్షల్లో సైన్యం, వెలకట్టలేని సంపద, పాడిపంటలతో సుభిక్షంగా సంతోషంగా ఉన్న ప్రజలు, ఇంకా పన్నెండు మంది కొడుకులతో వంశం ధృడంగా ఉందన్న మహదానందం.. ఇంతలో ఎవరో ఏడుస్తున్నట్టు తనకు వినిపించింది. ఏమిటా అని ఆలోచించేసరికి తన కల చెదిరిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి తన భార్య గుండెలవిసేలా ఏడుస్తుంది.. కొడుకు చనిపోయి ఉన్నాడు..! ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ్డాడు.. కలలో ఉన్న సామ్రాజ్యం, లక్షల్లో సైన్యం, తన పన్నెండుమంది కొడుకులు, వెలకట్టలేని ఆస్థి ఒక్కసారి కళ్ళుతెరిచి చూసేసరికి అంతా మాయమైపోయాయి.. ఇదంతా చూసి ఆ రాజు గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. అక్కడే ఉన్న భార్య, మిత్ర రాజులు, మంత్రులు, బంధువులు ఆశ్ఛర్యపడిపోయారు. కుమారుని మరణంతో మహారాజుకి మతిభ్రమించి ఉండొచ్చని వారంతా బాధపడుతున్నారు. భర్త నవ్వుకు మహారాణి ఒకింత కోపంతో "ఎందుకిలా నవ్వుతున్నారు.? మనం అల్లారు ముద్దుగా పెంచిన ఒక్కగానొక్క కొడుకు మరణిస్తే ఎందుకు నవ్వుతున్నారు..? మీకు ఏ మాత్రం బాధలేదా..? అని ప్రశ్నించింది.
రాజు ఇలా సమాధానమిచ్చాడు.. "ఇప్పుడే నాకు ఓ కల వచ్చింది.. ఏ మహారాజు ఊహించనంతటి సామ్రజ్యంలో నేను రాజును. నాకు పన్నెండుగురు కొడుకులు, నీ ఏడుపుతో(భార్య వంక చూస్తూ) నా కల చెదిరిపోయింది.. కళ్ళముందు చచ్చిన కొడుకు కనిపిస్తున్నాడు. ఏడుస్తున్న మీరంతా కనిపిస్తున్నారు. బహుశా నాకు ఇప్పుడే జ్ఞానోదయం కలిగింది, నాకో ధర్మసందేహం వచ్చింది. ప్రస్తుతం నేను ఎవరికోసం ఏడవాలి..? కలలో కనుమరుగయిపోయిన పన్నెండుమంది కొడుకుల కోసమా..? లేదంటే ఈ ఒక్క కొడుకు కోసమా..? ఈ సందేహంలోనే నాకు నవ్వు వచ్చింది.." మహారాణి "అది కేవలం ఒక కల". రాజు.. "కాదు ఈ రెండు కలలే.. ఒకటి కళ్ళు మూసినప్పటిది, రెండోది కళ్ళు తెరచినప్పటిది.! కళ్ళు మూసుకున్నప్పుడు బయట ఉన్న కల జ్ఞాపకానికి రాలేదు.. కళ్ళు తెరుస్తుండగానే కళ్ళు మూసినప్పటి కల అదృశ్యమయ్యింది. ఈ రెండు కలలే.." ఈ చిన్ని సంఘటనతో జీవితమే ఒక కల అన్న సత్యాన్ని తెలుసుకున్న అక్కడున్నవారందరికి ఓదార్పు లభించింది.