(Written by వాక్కేళి - @ivak99 on Twitter)
రేజింగ్లావా!
చైనా యుద్ధం చెంపపెట్టంటు ఒక్కముక్కలో తేల్చి పోవద్దు
మరిచిపోవాలి కొన్ని మచ్చల్ని అంటూ చరిత్ర పుటలు తిప్పొద్దు
విజయకేతనం అవనతమైందని అదే బెంగతో అంగలార్చొద్దు
వీరస్వర్గాన్ని ఎక్కిన సైన్యుల స్ఫూర్తి గాథలా స్మరణలాపొద్దు!
ఎముకలు కొరికే చలిలో, మలలో, మంచు కనుమలలొ పొంచిన మృత్యువు
దమనకాండకై సర్వ హంగుల్ని సిద్ధం చేసుకు కదిలిన శత్రువు
భాయీ భాయను నినాదఘోషలొ ఆదమరిచి నిదురోయిన ప్రభువు
నూటపద్నాల్గు సమిధల కుమవున్ దళం మొదలెట్టె నిశిలో క్రతువు!
అరకొర ఉడుపులు, అందని సరుకులు, సలపని ఊపిరి, గొడ్డుచాకిరీ
రెండవ ప్రపంచయుద్ధపు గన్నులు, చాలీచాలని మందు సామగ్రి
అగడ్త తవ్వగ లేవు పనిముట్లు, ఉత్తిచేతుల్తొ తెగ అగచాట్లు
భూమిపుత్రులకు లెక్కా బాధలు? నవ్వు చెదరనీ ఆహిర్ బంధులు!
సైతాన్ సింగని అరి భయంకరుడు, వీరయోధులా ధీరనాయకుడు
తోడుగ సుర్జా, హరీ, చందర్లు, నాయక్ యాదవ్ దండు సర్దార్లు
రేయింబవళ్ళు కాచ నిబద్ధులు వేయికళ్ళతో మన సరిహద్దులు
కడదాకా పోరాడగ శపథం, భారత్ మాతకి ఉసురు నివేదం
నాల్గు చెరగులా చైనా ముట్టడి, తొలి తాకిడినీ ధీటుగ కట్టడి
దొరికిన వాడిని మట్టుపెట్టడం, మేరను దాటగ తరిమికొట్టడం
ఊహకందనీ స్వైరవిహారం, లెక్కకుమిక్కిలిగా ప్రతిహారం
వ్యూహంమార్చుకు తిరిగి సంగరం, వేయి శతఘ్నుల మహా ప్రహారం!
గుళ్ళదెబ్బలకు ఒళ్ళు ఛిధ్రమై తుపాకి మీటని వదలని వేళ్ళూ
సహచరులొక్కొక్కరుగా ఒరిగిన కర్మయోగులే మిగిలినవాళ్ళు
ఆఖరిశ్వాసలొ జైభారత్ అని నింగికి ఎగిసిన శిఖ కన్నావా?
అది ప్రతిధ్వనించిన పుణ్యక్షేత్రం మంచు కొండలో రేజింగ్ లావా!