కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన అశోక్ కుమార్ కు పరిశోధనలు అంటే ఆసక్తి ఎక్కువ. JNTU లో PH.D కంప్లీట్ చేసి ఉపాధ్యాయునిగా చేస్తూనే గాయాలు తగిలినప్పుడు అవి త్వరగా తగ్గేలా ఒక కొత్త డ్రగ్ తయారుచేయాలనే ఉద్దేశంతో మొదట పరిశోధనలు మొదలుపెట్టాడు. ఈ పరిశోధనలు చేస్తుండగానే అశోక్ కి టీబి(క్షయ) వ్యాధి వచ్చింది. టీబి వ్యాధి అంత సులభంగా తగ్గదు కొన్నిసార్లు నెలల పాటు ట్రీట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక చేసేదేమీ లేక పరిశోధనలు మధ్యలోనే ఆపేసి ఆరునెలల పాటు ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. ఆ సమయంలోనే టీబి కోసం వాడిన మందుల ద్వారా అశోక్ కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి.

సాధారణంగా టీబి కోసం కొన్ని రకాలైన మందులు వాడాల్సి ఉంటుంది. ఇది టీబి వ్యాధిగ్రస్థులకు చాలా ఇబ్బంది ఉంటుంది. టీబి కోసం ఇప్పుడున్న ఏడురకాల మందులు కాకుండా ఒకే డ్రగ్ ఉంటే బాగుంటుందని దానిని తయారుచేయాలని సంకల్పించుకున్నాడు. అలా మూడేళ్ళపాటు టీబికి ఒకే మందు కోసం శ్రమించి, శోధించి, సాధించాడు. అశోక్ కనుగొన్న 20 కొత్త మాలిక్యూల్స్‌ని వ్యాధి కారక "మైకోబ్యాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ హెచ్37 ఆర్వీ" అనే బ్యాక్టీరియాపై సంధించాడు. తను కనుగొన్న డ్రగ్ మాలిక్యూల్స్ హానికర బ్యాక్టీరియాలను నాశనం చెయ్యడమేకాకుండా, వాటికి ఉపయోగపడే "పాంటోథీనేట్" అనే ఎంజైములను నిర్వీర్యంచేసి క్షయ నివారణలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. అశోక్ రూపొందించిన ఇరవై మాలిక్యుల్స్ లో ఆరు సమగ్రంగా పనిచేస్తున్నాయని కాకతీయ యూనివర్సిటీ నిర్ధారించింది. హైదరాబాద్ లో జరిగిన International Chemist & Chemical Engineering మీటింగ్ తన పరిశోధనల గురించి తెలియడంతో అక్కడికి వచ్చిన జాతీయ, అంతర్జాతీయ ప్రొఫేసర్లు అశోక్ ప్రతిభను గుర్తించి అశోక్ ను "యంగ్ సైంటిస్ట్" అవార్ఢుతో అభినందించారు.

అవకాశాలు రావడం లేదని, వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదని, లేదంటే డబ్బు లేదని, అదృష్టం లేదని, ఇంకా ఏవేవో కారణాలు చెప్పుకుంటు మన ఓటమికి లక్ష కారణాలు వెతుక్కుంటూ సమర్ధించుకుంటాం. ఓటమి తప్పు కాదు ఆ ఓటమి నుండి ఏమి నేర్చుకోకపోవడమే అసలైన తప్పు. విజేతలు తమ బలాన్ని ఎలా కనుక్కుంటారో అలాగే తమ లోపాన్ని కూడా తెలుసుకుని అధిగమించి తమ విజయానికి మార్గాన్ని సులభం చేసుకుంటారు. తాడూరి అశోక్ కుమార్ కూడా ఏదైతే తన విజయానికి ఆటంకంగా అడ్డుతగిలిందో దానినే లక్ష్యంగా ఎంచుకుని విజయం సాధించి ఒక మంచి మార్గాన్ని చూపాడు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.